Murali Ahobila

తెలుగు వెలుగులు By మురళి కృష్ణ అహోబిల వఝ్ఝల

నీ చరణ కమలాల
తెలుగు వెలుగుల మాల
అర్పింతునీ వేళ
ఓ కూనలమ్మ

“విశ్వనాధ” కవిత
చదువు మెదడుకు మేత
భాషలో ఎదురీత!!
ఓ కూనలమ్మ

పాట “దేవులపల్లి ”
పలుకు తేనెల తల్లి
వరపుత్రుడే చెల్లి
ఓ కూనలమ్మ

“కృష్ణ శాస్త్రు”ల  పాట
తెనుగు ముత్తెపు మూట
పూల పందిరి బాట
ఓ కూనలమ్మ
“జోడు శ్రీ” ల మూర్తి
భాష, భావ స్ఫూర్తి
అన్యులేవరికి నాస్తి
ఓ కూనలమ్మ

“దాశరధి” కవి గారు
తెలుగులో సర్దారు!
ఉర్దూ జమిందారు
ఓ కూనలమ్మ

అంత్యప్రాసల జల్లు
భాషలో పరవళ్ళు
“ఆరుద్ర” కే చెల్లు
ఓ కూనలమ్మ

“బాపు” బొమ్మల ఒంపు
బుడుగు మాటల ఇంపు
తెలుగు బాసకే సొంపు
ఓ కూనలమ్మ

భారతావని లోన
అగ్రనటులను ఎన్న
“ఎస్వి రంగడే” మిన్న
ఓ కూనలమ్మ

కధలో “కొడవటిగంటి”
కదిలించు నెటువంటి
బూర్జువా నని వింటి
ఓ కూనలమ్మ

తెలుగు సినిమా కీర్తి
“విశ్వనాద్” కష్టించి
విశ్వ స్థాయికి పెంచే
ఓ కూనలమ్మ

పాట తీపి గారె
పలుకు తెలుగు బూరె
“జ్ఞానపీఠి” “సినారె”
ఓ కూనలమ్మ